: ఏరు దాటేశాక ఇండియా బోడి మల్లన్నే... మారిపోయిన ఇరాన్!
'ఏరు దాటేదాకా ఓడ మల్లన్న, ఏరు దాటేశాక బోడి మల్లన్న' ఈ సామెత ఇప్పుడు భారత్ పట్ల ఇరాన్ తీరుకు సరిగ్గా సరిపోతుంది. ఇటీవలి కాలం వరకూ పలు రకాల ఆంక్షలను ఎదుర్కొన్న ఇరాన్, అవన్నీ తొలగేసరికి కొండెక్కి కూర్చుంది. నిన్నటివరకూ రవాణా చార్జీలు తీసుకోకుండా క్రూడాయిల్ ను ఇండియాకు చేరుస్తూ, చమురు ధరను రూపాయల్లో తీసుకున్న ఇరాన్, ఇప్పుడు గొంతెమ్మ కోరికలకు సిద్ధమైంది. మూడేళ్ల నుంచి అమలవుతున్న చమురు కాంట్రాక్టు నిబంధనలను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. ఇకపై ఉచిత రవాణా ఉండబోదని, రూపాయలకు బదులుగా యూరోల్లో చెల్లింపులు జరపాలని డిమాండ్ చేస్తోంది. చమురును కొనుగోలు చేసిన తరువాత ఉన్న చెల్లింపు కాల వ్యవధి 90 రోజులను కూడా తగ్గించేసింది. కాగా, ఇరాన్ నుంచి ఎస్సార్ ఆయిల్, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ తదితర సంస్థలు క్రూడాయిల్ ను కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థలు 6.5 బిలియన్ డాలర్ల మొత్తాన్ని ఇరాన్ కు బకాయిగా ఉండగా, దీన్ని తక్షణం చెల్లించాలని కూడా ఇరాన్ ఒత్తిడి తెస్తోంది. ఇరాన్ 2013లో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వేళ, ఇండియాను సహాయం అర్థిస్తూ, ఉచిత క్రూడాయిల్ షిప్పింగ్, రూపాయల్లో చెల్లింపులకు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇరాన్ వద్ద ఖాళీగా ఉన్న క్రూడాయిల్ రవాణా షిప్ లను ఒక్క పైసా కూడా తీసుకోకుండా భారత్ కు పంపుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఇరాన్ పై ఐరాస ఆంక్షలు తొలగిపోవడం, ఆపై అమెరికా స్నేహహస్తం అందిస్తూ చేసుకున్న ఒప్పందాలతో, ఇండియాకు అందిస్తున్న సదుపాయాలను విరమించుకుంటున్నట్టు తెలిపింది. ఈ మేరకు భారత సంస్థలకు లేఖ రాసినట్టు నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీ అధికారి తెలిపారు. ఇండియా సంస్థలు కావాలంటే, తమ షిప్ లలోనే రవాణా చేస్తామని, అందుకు మార్కెట్ రేటుతో పోలిస్తే తగ్గింపు ధర చెల్లించాల్సి వుంటుందని వివరించారు. 50 శాతం వరకూ డిస్కౌంటిస్తామని ఆఫర్ ఇచ్చినట్టు తెలిపారు. బకాయిపడ్డ సొమ్మును వచ్చే ఆరు నెలల్లో చెల్లించాలని కోరినట్టు తెలిపారు.