: భారత్ విడిచివెళ్లేది లేదు!... ప్రియాంక చేయూత అవసరం లేదు: రాబర్ట్ వాద్రా సంచలన వ్యాఖ్యలు


రాబర్ట్ వాద్రా... దేశంలో పరిచయం అక్కర్లేని ప్రముఖుడు. అప్పటిదాకా వాద్రా ఎవరో కూడా తెలియదు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూతురు ప్రియాంకా గాంధీని వివాహమాడిన తర్వాత ఒక్కసారిగా ఆయన ప్రముఖుల జాబితాలో చేరిపోయారు. పదేళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆయన హర్యానా కేంద్రంగా తన భూదాహాన్ని తీర్చుకున్నారని నిజాయతీ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా తేల్చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై హర్యానా ప్రభుత్వం ఇంకా నిజ నిర్ధారణ చేయకున్నా, వాద్రా అక్రమాలకు పాల్పడ్డారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో వాద్రాను కేసులు చుట్టుముట్టిన క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా అధికారాన్ని కోల్పోయింది. ఇంకేముంది?... వరుస క్రమంలో ప్రముఖుల హోదాలో వాద్రాకు అందుతున్న సౌకర్యాలన్నీ ఒక్కటొక్కటిగా మాయమయ్యాయి. ఈ క్రమంలో కేసులకు తట్టుకోలేక వాద్రా విదేశాలకు పారిపోవడం ఖాయమన్న పుకార్లు షికారు చేశాయి. వీటిపై వాద్రా కాస్తంత ఘాటుగానే స్పందించారు. తాను భారత్ విడిచివెళ్లే ప్రసక్తే లేదని ఆయన నేటి ఉదయం ‘ఏఎన్ఐ’ వార్తా సంస్థకు చెప్పారు. అంతేకాక తాను చిక్కుల్లో నుంచి బయటపడేందుకు తన భార్య ప్రియాంక చేయూత కూడా తనకు అవసరం లేదని పేర్కొన్నారు. తన తండ్రి తనకు కావాల్సిన అన్నింటినీ ఇచ్చారని, అన్ని రకాల పరిస్థితుల్లో భేషుగ్గా రాణించే సత్తా నేర్పారని కూడా వాద్రా వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News