: 'కేసీఆర్ బక్కోడే... బక్కగనే ఉన్నడు... అయినా సాధించుకొచ్చిండు' అంటూ నవ్వులు పూయించిన కేసీఆర్
"అంబేద్కర్ ఎవడు బక్కగా ఉన్నడో వారి పక్షాన నిలబడి పోరాడిండు. కేసీఆర్ బక్కగనే ఉన్నడు. కేసీఆర్ బక్కోడే... శ్రీహరిగారు నవ్వుతాండు. బక్కగా ఉండి కొట్లాడినా. అంబేద్కర్ గారి ఆశీర్వచనం ఉంది గాబట్టి, రాజ్యాంగంలో ఆయన పొందుపరిచిన చట్టం ఉంది గాబట్టి, ఆయన దయవల్ల నేను బక్కగా ఉన్నా తెలంగాణా రాష్ట్రం మనం సాధించుకోగలిగినం" అని తెలంగాణ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించగా, సభ నవ్వులతో నిండిపోయింది. ఈ ఉదయం ట్యాంక్ బండ్ సమీపంలో 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతిఒక్కరూ పాటించాలని, ఆయన కన్న కలలను సాకారం చేసుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఆయన ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బోరబండలో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవన నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ తో పాటు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.