: బొబ్బిలి కోటకు చెవిరెడ్డి, విజయసాయి... వైసీపీ మంత్రాంగం ఫలించేనా?
బొబ్బిలి రాజులు పార్టీ మారుతున్నారంటూ వచ్చిన వార్తలు ఏపీలో విపక్షం వైసీపీలో పెను ప్రకంపనలనే సృష్టించాయి. మాజీ మంత్రి, ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్ గా పనిచేసిన బొత్స సత్యనారాయణకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వాగతం పలికిన సందర్భంలోనే పార్టీ వీడేందుకు బొబ్బిలి బ్రదర్స్... బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణరంగారావు, ఆయన సోదరుడు, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు బేబి నాయన సిద్ధపడ్డారు. అయితే వైఎస్ జగన్ హామీతో నాడు వెనక్కు తగ్గారు. జగన్ ఇచ్చిన హామీ అమలులో కార్యరూపం దాల్చకపోవడం, టీడీపీ చేపట్టిన ఆకర్ష్ స్వైర విహారం నేపథ్యంలో తాజాగా నిన్న మద్దతుదారులతో బొబ్బిలి కోటలో భేటీ అయిన సుజయ... పార్టీ మారేందుకే నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి నుంచి అటు ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు నేటి ఉదయం ప్రింట్ మీడియాలోనూ వార్తలు వెల్లువెత్తడంతో వైసీపీ మేల్కొంది. పార్టీ అధినేత జగన్ ఆదేశాలతో ఆయనకు అత్యంత సన్నిహితులుగా పేరుపడిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిలు విజయనగరం బాట పట్టారు. నేరుగా సుజయతో పాటు ఆయన సోదరుడు బేబి నాయనతో భేటీ అయ్యేందుకు చెవిరెడ్డి, విజయసాయిలు యత్నిస్తున్నారు. గతంలో వీరి మంత్రాంగం ఫలించలేదు. నేరుగా జగన్ రంగంలోకి దిగితే గాని సుజయ వెనుకంజ వేయలేదు. ఇప్పుడు కూడా చెవిరెడ్డి, విజయసాయిల యత్నాలు ఫలించే అవకాశాలు కనిపించడం లేదన్న వార్తలు వినవస్తున్నాయి. ఈ క్రమంలో వైసీపీ ప్రారంభించిన బుజ్జగింపుల పర్వంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.