: స్నేహితురాలిపై అత్యాచారం చేస్తుంటే, దానిని ప్రత్యక్షప్రసారం చేసి, 40 ఏళ్ల జైలుశిక్షను అనుభవించనున్న టీనేజ్ యువతి!
సోషల్ మీడియా యాప్ 'పెరిస్కోప్'ను వాడి 17 ఏళ్ల యువతిపై తన స్నేహితుడు అత్యాచారం చేస్తుంటే, మొత్తం ఘటనను లైవ్ లో పంచుకున్న 18 ఏళ్ల టీనేజ్ యువతి జీవితం దాదాపు జైల్లోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన యూఎస్ లోని ఓహియోలో జరిగింది. ఫ్రాంక్లిన్ కౌంటీ ప్రాసిక్యూటర్ రాన్ ఓబ్రియన్ వెల్లడించిన వివరాల ప్రకారం, మరీనా లోనినా (18), 17 ఏళ్ల టీనేజ్ అమ్మాయి, 29 ఏళ్ల రేమాండ్ గేట్స్ ఒకే వీధిలో ఉంటూ స్నేహంగా ఉండేవారు. గత నెల 27న అమ్మాయిపై రేమాండ్ అత్యాచారం చేస్తుంటే, లోనినా ఆ దృశ్యాలను పెరిస్కోప్ సహాయంతో ప్రత్యక్ష ప్రసారం చేసింది. దీన్ని చూసిన వారి మిత్రుడు ఒకరు పోలీసులకు సమాచారం చేరవేశాడు. దీంతో లోనినా, గేట్స్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై కేసు పెట్టారు. వీరిపై అత్యాచారం, కిడ్నాప్, లైంగిక వేధింపులు, మైనర్ బాలికపై కామవాంఛ తీర్చుకోవడం వంటి సెక్షన్ల కింద కేసు పెట్టగా, ఇద్దరికీ 40 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని ఓబ్రియన్ వెల్లడించారు. దీంతో తాను చేసిన ఘోరమైన పనికి జీవిత చరమాంకం వరకూ లోనినా కటకటాల మధ్యనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.