: సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పై ఫేస్ బుక్ భారత చీఫ్ దాడి వ్యవహారం... రిపోర్టు కోరిన తెలుగు రాష్ట్రాల హైకోర్టు
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కు సంబంధించి టెక్నికల్ అంశాల కాపీరైట్ విషయంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పై దాడులు చేయించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థ భారత చీఫ్ కార్తీకరెడ్డిపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను అందించాలని తెలుగు రాష్ట్రాల హైకోర్టు ఆదేశించింది. కార్తీకరెడ్డి తనపై దాడులు చేయించారని ప్రదీప్ కుమార్ అనే ఐటీ ఇంజనీర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, విచారించిన న్యాయమూర్తి పీవీ సంజయ్ కుమార్ ఈ ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు ప్రదీప్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఈ కేసులో మాదాపూర్, జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. కేసును జూన్ 2కు వాయిదా వేసిన న్యాయమూర్తి, ఈలోగా వివరాలన్నీ తన ముందుంచాలని పోలీసులను ఆదేశించారు.