: మాల మహానాడు నేత కారెం శివాజీకి కీలక బాధ్యత!... ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గా నియామకం


మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీకి కీలక బాధ్యతలు అప్పగిస్తూ ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిన్న కీలక నిర్ణయం తీసుకున్నారు. నవ్యాంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు తొలి చైర్మన్ గా కారెంను నియమిస్తూ చంద్రబాబు ప్రభుత్వం నిన్న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాలంటూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పేరిట మంద కృష్ణ మాదిగ చేపట్టిన ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. దానికి వ్యతిరేకంగా ఎస్సీలను ఉమ్మడిగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ మాల మహానాడు పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. మాల మహానాడు ఉద్యమంలో కీలక భూమిక పోషించిన కారెం శివాజీ... తదనంతర కాలంలో ఎస్సీల్లో కీలక ఉద్యమ నేతగా ఎదిగారు. ఇటీవల లక్షలాది మందిని నట్టేట ముంచిన అగ్రిగోల్డ్ వ్యవహారంపై కారెం పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాల్సిందేనంటూ ఉద్యమించారు. ఈ క్రమంలో ఆయనను ఎస్సీ,ఎస్టీ కమిషన్ కు చైర్మన్ గా నియమిస్తూ చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పదవిలో కారెం మూడేళ్ల పాటు కొనసాగుతారు. తనకు కీలక బాధ్యతలు అప్పగించిన చంద్రబాబుకు కారెం కృతజ్ఞతలు తెలిపారు. జస్టిస్ పున్నయ్య స్ఫూర్తిలో ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం తనవంతు కృషి చేస్తానని ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News