: జగన్ అక్రమాస్తుల కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు... ఐఏఎస్ శ్యాంబాబుపై విచారణ నిలిపివేత!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాఖలైన అక్రమాస్తుల కేసుకు సంబంధించి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు నిన్న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అనంతపురం జిల్లాలోని లేపాక్షి నాలెడ్జ్ హబ్ కు చెందిన వ్యవహారానికి సంబంధించి సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యాంబాబుపై కొనసాగుతున్న విచారణను నిలుపుదల చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇళంగో ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకెళితే... దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన సమయంలో శ్యాంబాబు అనంతపురంలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ కు పెద్ద ఎత్తున భూములు కేటాయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన సీబీఐ చార్జిషీటు కూడా దాఖలు చేసింది. ప్రస్తుతం ఈ కేసు నాంపల్లి కోర్టు ఆవరణలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగుతోంది. అయితే తనపై సీబీఐ తప్పుడు ఆరోపణలు చేస్తోందని హైకోర్టును ఆశ్రయించిన శ్యాంబాబు... తనపై జరుగుతున్న విచారణను నిలిపివేయాలని కోరారు. దీనిపై నిన్న జరిగిన విచారణ సందర్భంగా శ్యాంబాబు తరఫు న్యాయవాది సుదీర్ఘ వాదనలు వినిపించారు. అఖిల భారత సర్వీసులకు చెందిన తన క్లెయింట్ ను విచారించేందుకు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి కూడా కావాలన్నారు. అయితే శ్యాంబాబును విచారించేందుకు అటు కేంద్రంతో పాటు ఇటు ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనుమతివ్వని అంశాన్ని ఆయన ప్రస్తావించార 2005-10 పారిశ్రామిక విధానం ప్రకారం అధికారులు నాలెడ్జ్ హబ్ తో మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ చేసుకున్నారని, దానిని రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదించిందని తెలిపారు. ఈ మేరకు కేంద్రం ఇచ్చిన వివరణను కూడా ఆయన కోర్టు ముందు పెట్టారు. శ్యాంబాబుపై విచారణను కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు నిరాకరించాయని, ఈ క్రమంలో విచారణ కొనసాగితే చట్టాలను దుర్వినియోగం చేయడమే అవుతుందని ఆయన వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన జస్టిస్ రాజా ఇళంగో... శ్యాంబాబుపై జరుగుతున్న విచారణను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.