: దిల్ రాజుకు లీగల్ నోటీసులు!... ‘పోలీసోడు’ టైటిల్ మార్చాలని పోలీసుల డిమాండ్
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుకు నిన్న రాత్రి లీగల్ నోటీసులు అందాయి. తెలంగాణ పోలీసు అధికారుల సంఘం ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేసింది. దిల్ రాజు నేతృత్వంలోని చిత్ర నిర్మాణ సంస్థ... తమిళ యువ హీరో విజయ్ నటించిన 'తెరి' తమిళ చిత్రాన్ని ‘పోలీసోడు’ పేరిట తెలుగులోకి అనువదించింది. రేపు(శుక్రవారం) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. పోలీసుల ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా సదరు చిత్రం టైటిల్ ఉందని తెలంగాణ పోలీసు అధికారుల సంఘం ఆరోపించింది. వెనువెంటనే రంగంలోకి దిగిన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, హైదరాబాదు శాఖ అధ్యక్షుడు దిల్ రాజుకు లీగల్ నోటీసులు జారీ చేశారు. పోలీసుల ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్న సదరు చిత్రం టైటిల్ ను మార్చాల్సిందేనని వారు ఆ నోటీసుల్లో డిమాండ్ చేశారు.