: బెజవాడలో రౌడీ షీటర్ల స్ట్రీట్ ఫైట్!... పరస్పరం కత్తులతో దాడి చేసుకున్న రెండు ముఠాలు
నవ్యాంధ్రప్రదేశ్ పొలిటికల్ రాజధానిగా రూపుదిద్దుకుంటున్న విజయవాడలో రౌడీ షీటర్లు పేట్రేగిపోతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత నగరంలో పోలీసు పహారా మరింత పెరిగిన నేపథ్యంలో కొంతకాలం పాటు తమ కార్యకలాపాలను తగ్గించేసిన రౌడీ షీటర్లు... తాజాగా నిన్న రాత్రి నగరంలోని నడిరోడ్లపై కత్తులు చేతబట్టుకుని స్వైర విహారం చేశారు. పోలీసు రికార్డుల్లో రౌడీ షీటర్ గా ఉన్న రాఘవేంద్ర అనే వ్యక్తిపై జాన్ బాబు అనే మరో రౌడీ షీటర్ వర్గం కత్తులతో విరుచుకుపడింది. ఈ దాడిలో రాఘవేంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. తమపై రాఘవేంద్ర అనుచరులు కత్తులతో దాడి చేశారని జాన్ బాబు వర్గం ఆరోపిస్తోంది. నగరంలోని పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై ఇరువర్గాలు పరస్పరం కేసులు పెట్టుకున్నాయి. ఈ ఘటన నగరంలో కలకలం రేపింది.