: భూ ప్రకంపనలు... శంఖాలు పూరించి అలర్ట్ చేసిన కోల్ కతా వాసులు
భారత్- మయన్మార్ సరిహద్దు కేంద్రంగా భూకంపం సంభవించింది.భూమిలో 134 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు సంబంధిత అధికారులు గుర్తించారు. ఆ కాసేపటికే కోల్ కతాలో కూడా భూమి కంపించింది. ఈ రోజు రాత్రి 7.25 గంటలకు ఈ భూకంపం సంభవించింది. కోల్ కతాలోని పెద్ద పెద్ద అపార్టు మెంట్లలో నివసిస్తున్న ప్రజలను అలర్ట్ చేసేందుకు గాను వీధుల్లో శంఖాలు ఊదుతూ అలర్ట్ చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ భూకంపం కారణంగా సునామీ వంటి ఘోర ప్రమాదం సంభవించే అవకాశం లేదని సంబంధిత శాఖాధికారులు చెప్పారు. భూ ప్రకంపనల కారణంగా ఢిల్లీ, కోల్ కతాలో మెట్రో రైళ్లు నిలిపివేశారు. ఈ విషయాన్ని తెలియపరిచేందుకు కొన్ని ట్వీట్లు కూడా చేశారు. ఇందులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరిక్ ఒబ్రిన్ చేసిన ట్వీట్ కూడా ఉంది. భూ ప్రకంపనలు సంభవించినట్లు అనిపించగానే తాను ఉన్న భవనంలో నుంచి బయటకు వచ్చానని ఆ ట్వీట్ లో ఆయన పేర్కొన్నారు.