: నేను చూసుకుంటాను...మీరు కానీయండి: 'సెల్ప్ డ్రైవింగ్ కార్ల'పై జర్మనీ ఛాన్సలర్
సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు నాణ్యతా పరీక్షల్లో ఫెయిలవుతున్నాయి. దీంతో ఇవి ఘోర రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే ప్రమాదం ఉందంటూ పలు దేశాలు వీటిని రద్దీ రోడ్లపై ప్రయోగాత్మకంగా నడిపేందుకు అనుమతించడం లేదు. ఇప్పటి వరకు సెల్ప్ డ్రైవింగ్ కార్లను ఎక్కువగా నిర్మానుష్య రోడ్లపైనే నడిపారు. రద్దీ రోడ్లపై నడిపే ప్రయత్నాలు చేసిన సందర్భంగా వీటిల్లో పలు లోపాలను గుర్తించారు. ఇవి విజయవంతమవుతున్న దశలో వీటిని హ్యాక్ చేసే ప్రమాదం ఉందంటూ పలువురు నిపుణులు మరోసారి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ కార్లను రోడ్లమీదకు తీసుకురావడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ దశలో సెల్ఫ్ డ్రైవింగ్ కారు పరీక్షలకు చట్టపరమైన ఇబ్బందులు ఏర్పడకుండా చూసుకుంటానని జర్మనీ ఛాన్స్ లర్ ఏంజెలా మోర్కెల్ భరోసా ఇచ్చారు. గూగుల్, టెస్లా, వుబర్ వంటి సంస్థలు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీటి పరీక్షలకు సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ సమస్యలు లేకుండా చూసుకుంటాను, ఎలక్ట్రిక్ ప్రోటోటైప్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల తయారీపై శ్రద్ధపెట్టాలని ఆమె కంపెనీలకు సూచించారు. దీంతో జర్మనీ రోడ్లపై ఈ కార్లు సందడి చేసే అవకాశం ఉంది. కాగా, ఈ రకమైన కార్లు 2020 కంటే ముందు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.