: తెలంగాణలో తొలిసారి ఎస్సై రాత పరీక్షకు బయోమెట్రిక్ విధానం: అనురాగ్ శర్మ
తెలంగాణలో త్వరలో నిర్వహించనున్న ఎస్సై రాత పరీక్షకు ప్రయోగాత్మక ఏర్పాట్లు చేసినట్టు డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, దేశంలోనే తొలిసారిగా ప్రయోగాత్మకంగా బయోమెట్రిక్ విధానాన్ని వినియోగిస్తున్నామని ఆయన చెప్పారు. విద్యార్థుల వేలి ముద్రలు, ముఖాన్ని పరిశీలించి పరీక్షకు అనుమతించనున్నామని ఆయన తెలిపారు. అలాగే పరీక్ష అనంతరం అభ్యర్థులు ఓఎంఆర్ షీట్ నకళ్లను ఇంటికి తీసుకెళ్లేందుకు అనుమతించనున్నామని ఆయన చెప్పారు. జేఎన్టీయూతో కలిసి రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి ఈ నెల 17న ఎస్సై రాత పరీక్ష నిర్వహించనుందని ఆయన తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుందని ఆయన చెప్పారు. 539 ఖాళీలు భర్తీ చేసేందుకు నిర్వహించనున్న ఈ పరీక్షను రాసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 350 కేంద్రాలను సిద్ధం చేశామని, మొత్తం 2 లక్షల మంది ఈ పరీక్షను రాయనున్నారని ఆయన తెలిపారు.