: పోలవరం ముంపు గ్రామాలను ఆదుకుంటాం: చంద్రబాబు
తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనమైన మండలాలను ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. పోలవరం ముంపు మండలాల్లో పర్యటించిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల 190 గ్రామాలు ముంపుకు గురవుతున్నాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు 32,535 ఎకరాలు ల్యాండ్ ఎక్విజేషన్ కింద తీసుకోవడం జరిగిందని అన్నారు. ఇంకా 18,565 ఎకరాలు ముంపుకు గురవుతాయని, దీనిని కూడా ఎక్విజేషన్ చేస్తామని ఆయన తెలిపారు. గిరిజనులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ప్రాజెక్టు ఫలితంగా భూములు కోల్పోయిన గిరిజనులకు భూమి ఇవ్వాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. అలా ఇవ్వాలంటే మొత్తం 14,850 ఎకరాల భూమిని సేకరించాలని ఆయన చెప్పారు. ఇంత భూమిని ఇవ్వడం చాలా కష్టంతో కూడుకున్న పని అని ఆయన తెలిపారు. ఇందుకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయిన ఖర్చు కంటే ఎక్కువ ఖర్చవుతుందని ఆయన చెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూసేకరణ కోసం చేసిన కొత్త చట్టం ప్రకారం ఇక్కడి ప్రజలకు న్యాయం చేస్తామని ఆయన చెప్పారు. నాలుగు మండలాలకు ఒక ఐటీడీఏ చొప్పున నిర్మిస్తామని ఆయన అన్నారు. గిరిజనులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూసుకుంటామని ఆయన చెప్పారు.