: పెళ్లికాని జంటల కోసం రూములిచ్చే 'ఆతిథ్య' స్టార్టప్!
నేటి తరం ఔత్సాహిక యువతలో ఒక చిన్న వినూత్న ఆలోచన వస్తే చాలు... స్టార్టప్ సంస్థ మొదలైపోవడం, ఆపై చకచకా ఉన్నతస్థాయికి ఎదగడం. అటువంటి చిన్న ఆలోచనే సంచిత్ సేథీకి వచ్చింది. ఆ ఆలోచనేంటో తెలుసా? పెళ్లికాని యువతీ యువకులకు హోటల్ లో గదులను ఇప్పించడం. అది కూడా గంటల వ్యవధికి. వాస్తవానికి పెళ్లికాకుంటే రూములు ఇవ్వకూడదన్న నిబంధన ఇండియాలో లేదు. భారత చట్టాల ప్రకారం అది శిక్షార్హం కూడా కాదు. కానీ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం పెళ్లికాకుండా యువతీ, యువకులు ఒకే రూములో ఉండటాన్ని మన సమాజం హర్షించదు. అందుకే వీరికి హోటళ్లలో రూములు ఇచ్చేందుకు మేనేజర్లు జంకుతారు కూడా. సవాలక్ష ప్రశ్నలు సంధిస్తారు. చాలాసార్లు రూము ఇవ్వలేమని చేతులెత్తేస్తారు కూడా. ఈ అడ్డంకులను తొలగించి అవివాహిత జంటకు ఆతిథ్యం ఇచ్చేలా 'స్టే అంకుల్' పేరిట సేథీ మొదలు పెట్టిన స్టార్టప్ సంస్థ ఇప్పుడు సూపర్ హిట్టయింది. తొలుత కొద్ది గంటల పాటు హోటల్ రూం కోరుకునే వారికి సాయపడాలన్న ఉద్దేశంతో ప్రారంభమైన ఈ సంస్థ ఆపై, అవివాహిత జంటల నుంచి వస్తున్న స్పందనతో వారి కోసమే ప్రత్యేక హంగులద్దుకుంది. ఢిల్లీ, గురుగ్రామ్ సహా, ముంబై, సిమ్లా, బెంగళూరు, పాటియాలా తదితర ప్రదేశాల్లోని వందలాది హోటళ్లతో సేథీ డీల్స్ కుదుర్చుకున్నారు. "12 గంటల పాటు గడిపేందుకు రూ. 1200 నుంచి రూ. 5 వేల వరకూ వెచ్చించాల్సి వుంటుంది. ముందుగానే రూమ్ బుక్ చేసుకోవచ్చు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ లేదంటే రాత్రి 8 గంటల నుంచి ఉదయం వరకూ రూములు తీసుకోవచ్చు. ప్రీమియం హోటళ్లనే మేము ఎంచుకున్నాం. త్వరలోనే మరిన్ని నగరాలు, పట్టణాలకు విస్తరిస్తాం" అని సేథీ తెలిపారు. ఒక చిన్న ఐడియా మొత్తం హోటల్ ఇండస్ట్రీనే మార్చేసేలా మారిందని ఆతిథ్య రంగ నిపుణులు ఇప్పుడు సేథీని మెచ్చుకోకుండా ఉండలేని పరిస్థితి.