: మహాభారతంతో 'గుర్గావ్'కు ఉన్న సంబంధమిదే... అందుకే 'గురుగ్రామ్' అయింది!
దేశ రాజధాని న్యూఢిల్లీని ఆనుకుని, ఐటీ సంస్థలకు ఆలవాలమైన గుర్గావ్ జిల్లా పేరును గురుగ్రామ్ గా మారుస్తూ, మనోహర్ లాల్ ఖట్టార్ నేతృత్వంలోని హర్యానా రాష్ట్ర ప్రభుత్వం నిన్న కీలక నిర్ణయాన్ని వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాంతంలోని ప్రజలు పేరు మార్పును డిమాండ్ చేస్తున్నారని ప్రకటించిన ఖట్టార్ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గురుగ్రామ్ పేరు పురాణేతిహాసాల్లోనే ఉందని, కాలక్రమేణా అది గుర్గావ్ గా మారిందని హర్యానా అధికారులు తెలిపారు. మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన ప్రాంతం ఇప్పుడు హర్యానాలోనే ఉంది. కౌరవ, పాండవుల కుల గురువు ద్రోణాచార్యుడు నడయాడిన ప్రాంతం కాబట్టి, దీనికి గురు గ్రామ్ అని పేరుందని, ఈ ప్రాంతం విద్యాకేంద్రంగా విలసిల్లిందని ప్రభుత్వం వెల్లడించింది. అందుకే పేరును మార్చినట్టు వివరించారు.