: ఎండలు 'దెబ్బ' కొడతాయి జాగ్రత్త!... అత్యవసరమైతే తప్పించి బయటకు రావద్దంటున్న వాతావరణ శాఖ
ఎండలు మండిపోతున్నాయి. ఇంటి నుంచి కాలు బయటకు పెడితే చాలు జనాన్ని కాల్చేస్తున్నాయి. భానుడి ప్రతాపానికి గురై ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో జనం చనిపోయారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ నేటి ఉదయం కీలక హెచ్చరిక జారీ చేసింది. నేటి నుంచి (బుధవారం) నాలుగు రోజుల వరకు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సాధారణం కంటే నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని ఆ శాఖాధికారులు చెప్పారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇల్లు వదిలి బయటకు రావద్దని హెచ్చరించారు. తప్పనిసరైతేనే గడప దాటాలని కూడా డేంజర్ బెల్స్ మోగించారు. ఒకవేళ బయటకు వచ్చినా, భానుడి వేడి నుంచి రక్షణ పొందే ముందు జాగ్రత్త చర్యలను పాటించాలని సూచించారు. ఇందులో ఏమాత్రం అశ్రద్ధ వహించినా వడదెబ్బ (సన్ స్ట్రోక్) తగలడం ఖాయమని ఆ శాఖ హెచ్చరించింది.