: కరుణ, జయలపై విజయకాంత్ ఘాటు వ్యాఖ్యలు!... స్టాలిన్ నూ వదలని కెప్టెన్
తమిళ నాట ఎన్నికల వేళ మాటల తూటాలు పేలుతున్నాయి. మొన్నటిదాకా తన పనేదో తాను చూసుకుంటూ వెళ్లిన డీఎండీఏ అధినేత విజయకాంత్ నిన్న నోరు విప్పారు. ఇప్పటిదాకా అటు డీఎంకే అధినేత కరుణానిధితో పాటు ఇటు అన్నాడీఎంకే అధినేత్రి జయలలితపై నేరుగా విమర్శలు సంధించని విజయకాంత్... నిన్న తాంబరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారిద్దరిపై ఒకేసారి విరుచుకుపడ్డారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రజల సొమ్మును దోచుకునేందుకు ఇద్దరు దోపిడీ దొంగలు వస్తున్నారు జాగ్రత్త’’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన విజయకాంత్... ఆ తర్వాత సరికొత్తగా కరుణ, జయలపై ఘాటు వ్యాఖ్యలు సంధించారు. అవినీతిలో కరుణ, జయలిద్దరూ సమఉజ్జీలేనని ఆయన ఆరోపించారు. తన దృష్టిలో కరుణానిధి చీరను జయ కట్టారని... అదే సమయంలో జయ ధోవతిని కరుణ కట్టారని విజయకాంత్ విమర్శించారు. ఐదు దశాబ్దాలుగా తమిళనాడును ఏలుతున్న డీఎంకే, అన్నాడీఎంకేలు రాష్ట్రాన్ని అధోగతి పాల్జేశాయన్నారు. సదరు పార్టీల పేర్లను కూడా ఆయన మార్చేసి కొత్త పేర్లు పెట్టేశారు. డీఎంకేను ‘తిల్లుముల్లు మున్నేట్ర కజగం (మోసపూరిత డీఎంకే)’, అన్నాడీఎంకేను ‘అనైత్తిల్లుం తిరుట్టు మున్నేట్ర కజగం (అన్నింటా దోపిడీలకు పాల్పడే పార్టీ)గా అభివర్ణించారు. ఇక డీఎంకే కోశాధికారి, కరుణ తనయుడు స్టాలిన్ ను టార్గెట్ చేసిన విజయకాంత్... ఆయనను చిన్న పిల్లలను ఎత్తుకెళ్లే బూచాడుగా అభివర్ణించారు.