: కుక్కలు!... ఇడియట్స్!: ఇంజినీర్లపై నోరు పారేసుకున్న సీనియర్ ఐఏఎస్


‘‘మీరంతా కుక్కలు... ఇడియట్స్...’’ అంతేకాదు, ఇంకా రాయలేని భాషతో బూతుపురాణం. ఇదేదో సభ్యత, సంస్కారం లేని వ్యక్తి చేసిన వ్యాఖ్యలు కాదు. పాలనలో అందరికంటే ఉన్నత స్థాయిలో ఉన్న ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి చేసిన వ్యాఖ్యలు. అది కూడా ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న ఇంజినీరింగ్ ఉన్నతాధికారులపై సదరు అధికారి నోరు పారేసుకున్న తీరిది. ఇదేదో నాలుగ్గోడల మధ్య జరిగిన విషయం కాదు. రాష్ట్రంలో సదరు శాఖ అధికారులందరి సమక్షంలో వీడియో కాన్ఫరెన్స్ లో చోటుచేసుకున్న దృశ్యం. ఐఏఎస్ అధికారి గారి నోటి నుంచి ఈ పదాలు వరుసగా వినిపించడంతో ఇంజినీరింగ్ అధికారులు షాక్ కు గురయ్యారు. వివరాల్లోకెళితే... హైదరాబాదులోని సచివాలయంలో మొన్న సోమవారం ఏపీ సర్కారు నిర్వహిస్తున్న ‘నీరు-చెట్టు’ కార్యక్రమానికి సంబంధించి సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ కు నీటిపారుదల అభివృద్ధి సంస్థ (ఐడీసీ), భూగర్భ జల శాఖ ఇంజినీరింగ్ అధికారులతో పాటు ఐడీసీ డైకెక్టర్లు, జిల్లాల్లోని ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తాను అడిగిన సమాచారం ఇవ్వడంలో కాస్తంత జాప్యం జరగడంతో సదరు ఐఏఎస్... ఆగ్రహోదగ్రుడయ్యారు. కాన్ఫరెన్స్ సాక్షిగానే ఆయన తన నోటికి పని చెప్పారు. కుక్కలు, ఇడియట్స్ అనే పదాల వినియోగంతో ఆగని ఆయన బూతు పురాణం కూడా అందుకున్నారు. అంతేకాక ఈ కాన్ఫరెన్స్ కు హాజరుకాలేదన్న కారణంగా ఇద్దరు ఎస్ఈ స్థాయి ఇంజినీరింగ్ అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత అధికారులను నేరుగా సస్పెండ్ చేసే అధికారం తనకు లేదని తెలుసుకున్న ఆ ఐఏఎస్... సదరు ఇంజినీర్లకు నిన్న షోకాజ్ నోటీసులు జారీ చేశారట. ఈ వ్యవహారంపై ఏపీకి చెందిన ఇంజినీరింగ్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News