: వైఎస్ జగన్ కు మరో షాక్!... టీడీపీ గూటికి గిద్దలూరు ఎమ్మెల్యే?
ఏపీలో అధికార టీడీపీ ప్రారంభించిన ‘ఆకర్ష్’ ఇప్పుడప్పుడే ముగిసేలా లేదు. ఇప్పటికే విపక్ష వైసీపీ టికెట్ పై విజయం సాధించిన 11 మంది ఎమ్మెల్యేలు టీడీపీ గూటికి చేరారు. విడతలవారీగా జరిగిన ఈ ‘జంపింగ్’ల్లో వైసీపీలో కీలక నేతలుగా ఎదిగిన భూమా నాగిరెడ్ది, జ్యోతుల నెహ్రూ తదితరులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఝలక్కిచ్చారు. తాజాగా ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కూడా టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ విషయం వెలుగు చూసిన వైనం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడితో అశోక్ రెడ్డి ఇప్పటికే భేటీ అయ్యారనే వాదన వినిపిస్తున్నా, ఎక్కడా ఆ వార్త బయటకు పొక్కలేదు. అయితే గిద్దలూరు టీడీపీ నేతలకు ఈ విషయం చేరిపోయింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పార్టీ నియోజకవర్గ నేతలు... ఆదివారం నేరుగా హైదరాబాదు వచ్చారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తో భేటీ అయ్యేందుకు యత్నించారు. అయితే లోకేశ్ హైదరాబాదులో లేరని, విజయవాడలో ఉన్నారని తెలుసుకుని అక్కడికీ పయనమయ్యారు. రెండు రోజుల పాటు శ్రమించి ఎట్టకేలకు నిన్న విజయవాడలో నారా లోకేశ్ ను వారు కలిశారు. అశోక్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకోవద్దని వారు లోకేశ్ కు విన్నవించారు. పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జీ అన్నే రాంబాబు బాగానే పనిచేస్తున్నారని, ఆయన నేతృత్వంలో పార్టీ బాగానే బలపడిందని, కొత్తగా అశోక్ రెడ్డి పార్టీలోకి రావడంతో ఒరిగేదేమీ లేదని చెప్పారు. నేతలు చెప్పిన విషయాలను సాంతం విన్న నారా లోకేశ్ వారిని అనునయించే యత్నం చేశారు. పార్టీలోకి చేరతామంటూ ఎవరు ముందుకు వచ్చినా కాదనవద్దని వారికి సూచించారు. అయినా పార్టీలో చేరుతున్న విపక్ష ఎమ్మెల్యేలకు చెందిన నియోకవర్గాలకు సంబంధించిన పార్టీ నేతలకు సర్దిచెప్పిన తర్వాతే ముందడుగు వేస్తున్నాం కదా అని కూడా లోకేశ్ వారికి చెప్పారు. ఎవరికీ తెలియకుండా విపక్ష ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకోవడం లేదని కూడా ఆయన తెలిపారు. పార్టీ భవిష్యత్తు ప్రయోజనాల దృష్ట్యా విపక్ష ఎమ్మెల్యేల చేరికను అడ్డుకోవద్దని ఆయన వారిని అనునయించి పంపారు. సొంత పార్టీ నేతలు లోకేశ్ ను కలవడంతో... అశోక్ రెడ్డి టీడీపీలో చేరుతున్న వైనం బయటకు వచ్చేసింది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.