: ఖాళీ పార్శిల్ పంపిన ‘అమెజాన్’... కొరియర్ బాయ్ ని అడ్డుకున్న వినియోగదారుడు!
ఆన్ లైన్ లో బుక్ చేసిన వస్తువుకు బదులు ఖాళీ కవర్ ఉండటంతో వినియోగదారులు ఆశ్చర్యపోయిన సంఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా, వరంగల్ జిల్లా ములుగులో మరో సంఘటన చోటుచేసుకుంది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ‘అమెజాన్’లో రూ.315 విలువ చేసే మెమొరీ కార్డు బుక్ చేసుకున్న వెంకటాపురం మండటం నల్లగుంట వాసికి ఈరోజు చేదు అనుభవం ఎదురైంది. ఆ గ్రామానికి చెందిన జనగాం రవి అనే యువకుడు ఇటీవల అమెజాన్ ఆప్ లో ఈ మెమొరీ కార్డును బుక్ చేశాడు. పార్శిల్ ను తీసుకుని కొరియర్ బాయ్ అతని ఇంటికి ఈరోజు వెళ్లాడు. అయితే, అతను ఇంట్లో లేకపోవడంతో సోదరుడు బాబురావు రూ.315 చెల్లించి ఆ పార్శిల్ ను తీసుకున్నాడు. కొరియర్ బాయ్, ఇరుగుపొరుగు వారి ముందే బాబురావు ఆ పార్శిల్ ను ఓపెన్ చేయగా, అందులో మెమొరీ కార్డుకు బదులు ఖాళీ కవర్ ఉంది. దీంతో ఆగ్రహించిన అతను, ఆర్డరు చేసిన వస్తువు ఇచ్చే వరకూ కదలనివ్వనంటూ కొరియర్ బాయ్ ని అడ్డుకున్నాడు. తమ సంస్థ ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడిన కొరియర్ బాయ్ తిరిగి ఆ డబ్బును ఇచ్చి వేసి అక్కడి నుంచి బయటపడ్డాడు.