: బ్రిటన్ వర్ధమాన క్రికెటర్ అడ్రియాన్ హత్య
బ్రిటన్ కు చెందిన వర్ధమాన క్రికెటర్ అడ్రియాన్ సెయింట్ జాన్(22) ట్రినిడాడ్ లో హత్యకు గురయ్యాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు.. లండన్ లోని క్రిస్ గేల్ అకాడమీకి చెందిన క్రికెటర్ అడ్రియాన్ హాలిడేస్ నిమిత్తం ట్రినిడాడ్ వెళ్లాడు. ఆదివారం రాత్రి ఒక వ్యక్తిని తన కారులో ఎక్కించుకునేందుకని ట్రినిడాడ్ లోని శాన్ జ్వాన్ ప్రాంతంలో కారు ఆపాడు. ఆ సమయంలో ఇద్దరు దుండగులలో ఒకడు అతనిపై కాల్పులకు పాల్పడ్డాడు. అడ్రియాన్ తలలోకి తూటా దూసుకుపోవడంతో అక్కడికక్కడే చనిపోయినట్లు సమాచారం. దోచుకునే ప్రయత్నంలోనే దొంగలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపినట్లు ట్రినిడాడ్, టొబాగో గార్డియన్ ఆన్ లైన్ పేర్కొంది. కాగా, ఈ సంఘటనపై వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ ట్వీట్ చేశాడు. ఈ సంఘటన చాలా బాధాకరమైందని, అడ్రియాన్ కుటుంబానికి, స్నేహితులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు.