: నా ప్రపంచం తల్లకిందులైంది...రిటైర్ అవుతున్నా: జేమ్స్ టేలర్
నా ప్రపంచం తల్లకిందులైంది...అందుకే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలుకుతున్నానని ఇంగ్లండ్ క్రికెటర్ జేమ్స్ టేలర్ తెలిపాడు. 26 ఏళ్ల అత్యంత చిన్న వయసులోనే ఈ ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకడం విశేషం. తాను ప్రాణాంతక వ్యాధి బారినపడ్డానని జేమ్స్ టేలర్ ట్వీట్ చేశాడు. 'ఇది నా జీవితంలో అత్యంత క్లిష్టమైన సమయం...నా ప్రపంచం తల్లకిందులైంది...జీవన్మరణ పోరాటం చేస్తున్నాను...అత్యంత ప్రమాదకరమైన గుండె జబ్బుతో బాధపడుతున్నా'నని వెల్లడించాడు. దీంతో క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది. ఈ విషయం ట్విట్టర్లో చూసిన ఇంగ్లండ్ టీమ్ డైరెక్టర్ ఆండ్రూ స్ట్రాస్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఇది చాలా బాధాకరమని అభిప్రాయపడ్డాడు. కాగా, జేమ్స్ టేలర్ ఇంగ్లండ్ తరపున 7 టెస్టులు, 27 వన్డేలలో ప్రాతినిధ్యం వహించాడు.