: ఆ రోజే చచ్చిపోయాను...ప్రశాంతత కావాలి...నా ఫోటో వాడుకోవడం ఇక ఆపేయండి: గోద్రా అల్లర్ల బాధితుడు ఖుత్బుద్దీన్ అన్సారీ


ఖుత్బుద్దీన్ అన్సారీ...దేశంలో సోషల్ మీడియా వినియోగించే ప్రతి ఒక్కరికీ పరిచయమున్న వ్యక్తి. ఏదో ఒక సందర్భంలో అతని ఫోటో చూసి, ఆవేదన చెందని వ్యక్తి ఉండడంటే అతిశయోక్తి కాదు. గుజరాత్ లోని గోద్రా అల్లర్ల సందర్భంలో హిందూ మూకలు, ముస్లింలను అత్యంత పాశవికంగా హత్యలు చేసుకుంటూ పోతున్న సమయంలో ఖుత్బుద్దీన్ ఇంటిని కొంత మంది మతాంధులు చుట్టుముట్టారు. వారికి చిక్కకుండా ఫస్ట్ ఫ్లోర్ కు వెళ్లి దాక్కున్న ఖుత్బుద్దీన్ హృదయవిదారకంగా ఏడుస్తూ...రెండు చేతులు జోడించి అక్కడికి చేరుకున్న ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను తన కుటుంబాన్ని రక్షించాలని వేడుకున్నాడు. ఆ సమయంలో ఓ ఫోటో గ్రాఫర్ అతని ఆవేదనను కెమెరాతో క్లిక్ మనిపించాడు. అప్పటి నుంచి ఈ ఫోటో ప్రపంచ వ్యాప్తమైంది. ఎన్నికలు ఎక్కడ జరిగినా బీజేపీ ప్రత్యర్థులు ఈ ఫోటోను వాడుకుంటున్నారు. గుజరాత్ తరహా పాలనను కావాలనుకుంటే బీజేపీకి ఓటేయాలని వారు సూచిస్తున్నారు. తాజాగా అసోం ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అతని ఫోటోను బీజేపీ వ్యతిరేక ప్రచారంలో వినియోగించుకుంది. ఈ నేఫథ్యంలో ఖుత్బుద్దీన్ స్పందించారు. తన ఫోటోను వాడుకోవడం మానేయాలని సూచించారు. ఆ నాటి ఘటన ఇప్పటికీ తన కళ్ల ముందు ఉందని ఆయన చెప్పారు. ఒక రకంగా ఆ రోజే తాను చచ్చిపోయానని ఆయన అన్నారు. పదేళ్ల తరువాత తన పిల్లలు 'నాన్నా ఆ ఫోటోలో ఎవరిని అంతలా ఏడుస్తూ ప్రాధేయపడుతున్నావని అడుగుతున్నారని, వారలా అడిగిన ప్రతిసారీ వారికి సమాధానం చెప్పలేక ఛస్తున్నా'నని ఆయన తెలిపారు. తనకు ప్రశాంతత కావాలని, ఇప్పటికైనా తన ఫోటో వాడుకోవడం మానేయాలని ఆయన రాజకీయ పార్టీలకు సూచించారు.

  • Loading...

More Telugu News