: మార్కెట్లకు కొత్త ఉత్సాహం... కొనసాగిన లాభాలు


సోమవారం నాటి భారీ లాభాల తరువాత, ఓ వైపు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు యత్నిస్తున్నప్పటికీ, నూతన కొనుగోళ్లు కూడా కనిపించడంతో మార్కెట్లు నిలదొక్కుకున్నాయి. ఆసియా మార్కెట్ల లాభాలకు తోడు, యూరప్ మార్కెట్ల సరళి ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను నిలిపింది. దీంతో కొద్దిపాటి ఒడిదుడుకులు నమోదైనప్పటికీ, బెంచ్ మార్క్ సూచికలు అరశాతం మేరకు పెరిగాయి. మంగళవారం నాటి ట్రేడింగ్ సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 123.43 పాయింట్లు పెరిగి 0.49 శాతం లాభంతో 25,145.59 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 37.75 పాయింట్లు పెరిగి 0.49 శాతం లాభంతో 7,708.95 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ ఒక శాతం, స్మాల్ క్యాప్ 0.90 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 38 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. గెయిల్, మారుతి సుజుకి, టాటా మోటార్స్, జడ్ఈఈఎల్ తదితర కంపెనీలు లాభపడగా, కోల్ ఇండియా, టాటా స్టీల్, ఐడియా, ఐటీసీ, టెక్ మహీంద్రా తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. బీఎస్ఈలో మొత్తం 2,745 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,519 కంపెనీలు లాభాల్లోను, 1,103 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి. సోమవారం నాడు రూ. 94,96,915 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ ఈరోజు రూ. 95,56,921 కోట్లకు పెరిగింది.

  • Loading...

More Telugu News