: కేరళను చూసి మారిన కర్ణాటక... 500 ఏళ్లలో తొలిసారి టపాసులు లేకుండా జాతర!
కేరళలోని కొల్లం సమీపంలోని పుట్టింగళ్ దేవి ఆలయంలో బాణసంచా పేలిన సందర్భంలో జరిగిన ఘోర విషాదం, కర్ణాటక వాసులను ఆలోచనలో పడేసింది. పాత బెంగళూరులోని ధర్మారాయస్వామి ఆలయంలో శక్తిమాతకు పూజలు జరిపి నిర్వహించే కరగ ఉత్సవాల్లో ఈ సంవత్సరం టపాకాయలు కాల్చరాదని నిర్వాహకులు నిశ్చయించారు. ఈ నెల 19న కరగ జరగనుండగా, దాదాపు లక్ష రూపాయల విలువైన టపాకాయలు కాల్చాలని ముందు తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసుకున్నారు. పౌర్ణమి రోజున ప్రారంభమయ్యే ఉత్సవం 9 రోజుల పాటు సాగుతుంది. దాదాపు 500 ఏళ్ల క్రితం నుంచే కరగ ఉత్సవాల్లో టపాసులు కాల్చడం ఉందని సమాచారం. ఈ సంవత్సరం మాత్రం 'ఢాం' శబ్దాలు వినిపించకుండా ఊరేగింపు జరగనుంది.