: ఆదినారాయణరెడ్డి మనుషులు చంపేస్తారు: రామసుబ్బారెడ్డితో ఏడుస్తూ చెప్పిన అనుచరులు!


కడప జిల్లాలో ముఖ్యమైన నేతలంతా ఒకే గూటికి చేరిపోతుండటంతో, గతంలో వారి మధ్య నెలకొన్న పగలు ఎప్పుడు ఎవరిని బలి చేస్తాయోనని అటు ప్రజలతో పాటు, ఇటు అధికారులు సైతం ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల దాడులు జరిగిన పెద్దదండ్లూరు గ్రామాన్ని మాజీ మంత్రి, తెలుగుదేశం నేత పీ రామసుబ్బారెడ్డి సందర్శించిన వేళ, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఆయన సోదరుడు రామాంజనేయ రెడ్డి తమపై దాడులు చేశారని పలువురు రామసుబ్బారెడ్డి వద్ద వాపోయారు. దాడికి గురైన సుబ్బారాయుడి భార్య ఆయన వద్దకు వచ్చి జరిగిన ఉదంతాన్ని కన్నీళ్లతో చెప్పింది. అభివృద్ధి పనులు చేయించాలని కోరినందుకే, చెప్పులతో కొట్టుకుంటూ ఈడ్చుకు వెళ్లారని వాపోయింది. తాము కేసులు పెట్టలేమని, ఇప్పుడు మీరు వచ్చినందుకు, తర్వాత మమ్మల్ని చంపేస్తారని భయపడుతూ చెప్పింది. ట్రాక్టర్లలో వచ్చిన జనాలు ఊరిపై దాడి చేసి డబ్బులు దోచుకెళ్లారని, ఇళ్లల్లోకి దూరి ఫర్నీచర్ ధ్వంసం చేశారని బాధితులు ఆరోపించారు. కాగా, రామసుబ్బారెడ్డి పర్యటనపై స్పందించిన ఆది, గ్రూప్ రాజకీయాల కోసమే ఆయన ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. తనకు వ్యక్తిగతంగా ఏ సహాయం చేయలేదని ఆరోపిస్తూ ఓ వ్యక్తి తననే కత్తితో బెదిరించాడని, తాను ఎక్కడా ఫ్యాక్షన్ ను ప్రోత్సహించడం లేదని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం బలోపేతానికి రామసుబ్బారెడ్డితో కలసి పనిచేసేందుకు సిద్ధమేనని అన్నారు.

  • Loading...

More Telugu News