: విజయ్ మాల్యాకు కృతజ్ఞతలు చెప్పిన విరాట్ కోహ్లీ!
బ్యాంకులకు రూ. 9 వేల కోట్లను ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన యూబీ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యాను భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ పొగడ్తలతో ముంచెత్తాడు. ఆయన వల్లే తానీ స్థాయిలో ఉన్నానని చెప్పుకొచ్చాడు. నేడు కోహ్లీ కెప్టెన్సీలో రాయల్ చాలెంజర్స్ జట్టు, హైదరాబాద్ సన్ రైజర్స్ తలపడనున్న వేళ, ఆయన మీడియాతో మాట్లాడాడు. ఐపీఎల్ ప్రారంభంలో చాలెంజర్స్ తరఫున ఆటగాడిగా, మాల్యా తనను ఎంపిక చేశారని గుర్తు చేసుకున్నాడు. ఆ తరువాతనే తాను క్రికెట్ లో ఉన్నత శిఖరాలకు ఎదగడం మొదలు పెట్టానని, అందుకు మాల్యాకు కృతజ్ఞతలని చెప్పుకొచ్చాడు. ప్రపంచంలోని ఉత్తమ ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశాన్ని తనకు మాల్యా అందించారని, తమ జట్టు ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేకపోయినా, టాప్-3 జట్లలోనే ఉందని గుర్తు చేశాడు.