: మహారాష్ట్ర దాహార్తిని తీరుస్తున్నందుకు మోదీకి కేజ్రీవాల్ ప్రశంసలు
తీవ్ర నీటి ఎద్దడినెదుర్కొంటున్న పశ్చిమ మహారాష్ట్రలోని లాతూరుకు 50 టాంకర్లతో నీటి రైలును నడుపుతున్నందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్రమోదీని ప్రశంసించారు. అక్కడి మరఠ్వాడా ప్రాంత తాగునీటి సమస్య పరిష్కరిస్తున్నందుకు మోదీని కేజ్రీవాల్ అభినందించారు. ఢిల్లీ ప్రభుత్వం నుంచి కూడా లాతూరుకు రెండు నెలల వరకు రోజుకు పది లక్షల లీటర్ల నీరును అందించనున్నట్లు కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. నీటి రైలును పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ విషయమై సంబంధిత అధికారులతో ఇప్పటికే చర్చించినట్లు లాతూరుకు నీటి రైలును పంపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. మరఠ్వాడా ప్రాంతంలోని లాతూర్‌లో నీటి ఎద్దడి నెలకొన్న నేపథ్యంలో అక్కడి గ్రామాలకు నీటి రవాణాకోసం కావలసినన్ని సార్లు టాంకర్లతో నీటి రైళ్లను నడుపుతామని రైల్వే అధికారులు తెలిపిన సంగతి తెలిసిందే. నీటితో మీరజ్ నుంచి బయల్దేరే రైలు 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించి లాతూరు ప్రజలకు నీటిని అందిస్తుంది.