: 43 రోజుల జ్యూవెలర్స్ సమ్మె కాలాఫ్... రేపటి నుంచి తెరచుకోనున్న దుకాణాలు
ఫిబ్రవరి నెలాఖరులో పార్లమెంట్ ముందుకు వచ్చిన బడ్జెట్ ప్రతిపాదనలతో ఆభరణాల రంగానికి నష్టం జరుగుతుందని ఆరోపిస్తూ, 43 రోజులుగా సమ్మె చేస్తున్న ఆభరణాల వర్తకందారులు సమ్మె విరమించారు. ఒక శాతం ఎక్సైజ్ సుంకాలను తొలగించాలని, రూ. 2 లక్షలకు మించిన కొనుగోళ్లపై పాన్ కార్డు నమోదు తీసివేయాలని వీరు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ప్రభుత్వం ఓ మెట్టు దిగేలా కనిపించని పరిస్థితుల్లో, సమ్మె విరమించాలని నిర్ణయించినట్టు ఉమేద్ మల్ డ్రిలోక్ చంద్ జవేరీ డైరెక్టర్ కుమార్ జైన్ వివరించారు. వాస్తవానికి నెలన్నర రోజులుగా సమ్మె కొనసాగుతుండటంతో, వ్యాపారం జరుగక ఆభరణాల తయారీరంగం భారీగా నష్టపోయింది. ఈ రంగంలోని వ్యాపారుల్లో కొందరు సమ్మె విరమించి దుకాణాలు తెరవగా, అత్యధికులు సమ్మెలోనే ఉండిపోయారు. సమ్మె కారణంగా దాదాపు రూ. 50 వేల కోట్ల నష్టం వచ్చినట్టు ఈ రంగం నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, ఈ మధ్యాహ్నం జ్యూవెలర్స్ ను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగిస్తారని, ఆపై సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. బుధవారం నుంచి దుకాణాలు తిరిగి తెరుస్తామని జ్యూవెలర్స్ అసోసియేషన్ వర్గాలు వెల్లడించాయి.