: పవన్ కల్యాణ్ ఎటువైపు?... మా వైపేనంటున్న టీడీపీ, కాదు మా వైపంటున్న వైసీపీ
టాలీవుడ్ అగ్ర నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో రాజకీయాల్లో కీలకంగా మారనున్నారు. తన తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ విడుదల తర్వాత పలు టీవీ చానెళ్లతో మాట్లాడిన పవన్ కల్యాణ్... ఇక పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చేస్తున్నట్లు ప్రకటించారు. 2019లో జరిగే ఎన్నికల నాటికి సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేయనున్న పవన్ కల్యాణ్... రాజకీయాలకే పరిమితం కానున్నట్లు ఆయన అభిమానులు చెబుతున్నారు. మరి సొంతంగానే జనసేన పేరిట పార్టీ ఉన్నా... పవన్ కల్యాణ్ ఏదో ఒక పార్టీ వెంట అడుగులు వేస్తారని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్... అధికార టీడీపీ వైపు మొగ్గుతారా? విపక్ష వైసీపీ వైపు రూటు మార్చుతారా? అన్న అంశంపై చర్చకు తెర లేచింది. గడచిన ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు పలికిన పవన్ కల్యాణ్ ఇకపై తమతోనే నడుస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే గడచిన ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం అమలుపరచలేదన్న అసంతృప్తితో ఉన్న పవన్ కల్యాణ్ టీడీపీ వెంట నడిచే అవకాశాలే లేవని వైసీపీ చెబుతోంది. పవన్ కల్యాణ్ తదుపరి పయనం తమ వెంటేనని కూడా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ రానున్న ఎన్నికల్లో ఎవరి వెంట నడుస్తారన్న అంశంపై చర్చ జోరందుకుంది.