: ముంబైలోని ఐదంతస్తుల భవనంలో మంటలు... రక్షించాలంటూ భవనంపై నుంచి 80 మంది ఆర్తనాదాలు
మహారాష్ట్ర రాజధాని ముంబైలో నేటి ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలోని భివాండీలోని కాశీంనగర్ కు చెందిన ఓ ఐదంతస్తుల భవంతిలో ఎగసిన మంటలు క్షణాల్లో ఆ భవంతిని చుట్టుముట్టేశాయి. అగ్ని ప్రమాదం సంభవించే సమయానికి ఆ భవంతిలో 80 మంది ఉన్నట్లు సమాచారం. దీంతో వారంతా భవంతిలోనే చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అయితే మంటల నుంచి రక్షించుకునే క్రమంలో వారంతా భవనంపైకెక్కి పిట్ట గోడ చివరకు చేరుకుని వరుసగా నిలబడి రక్షించాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పరుగు పరుగున అక్కడకు చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చే చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఓ వైపు ఎగసిపడుతున్న మంటలు, మరోవైపు భవనంపైకెక్కి రక్షించాలంటూ చిక్కుబడ్డ బాధితుల ఆర్తనాదాలతో అక్కడ తీవ్ర భయానక వాతావరణం నెలకొంది.