: వైసీపీలో ‘వన్ మ్యాన్ రూల్’... ఆ పార్టీ పరిణతి చెందదు: జ్యోతుల సంచలన వ్యాఖ్యలు


మొన్నటిదాకా ఏపీలో విపక్ష పార్టీ వైసీపీలో... తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే కీలక నేత. మూడేళ్లకు పైబడి వైసీపీలో కొనసాగిన జ్యోతుల ఆ పార్టీ నేతల్లో అగ్రగణ్యుడిగా ఎదిగారు. అయితే పార్టీ వైఖరి, పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహార సరళితో పొసగలేక జ్యోతుల పార్టీ మార్చేశారు. వైసీఎల్పీ ఉపనేత పదవికి, పార్టీ పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు. ఈ సందర్భంగా నిన్న విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన సైకిలెక్కేశారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో అంతా ఏక నాయకత్వం, ఏక ఆలోచన ఉన్నాయని ఆరోపించారు. ఇంకా వైసీపీలోనే కొనసాగితే, రాష్ట్ర ప్రజలకు నష్టం చేసినవాడినవుతాననే తన స్వగృహానికి (టీడీపీలోకి) వచ్చేశానని ఆయన పేర్కొన్నారు. తాను తప్ప అందరూ జీరో అనుకునే నాయకుడి వద్ద ఎంతకాలం కష్టపడి పనిచేసినా పార్టీ అభివృద్ధి కాదన్నారు. ‘‘రాష్ట్రానికి బలమైన ప్రతిపక్షం కావాలి. ఆ ప్రతిపక్షానికి సమాజాన్ని అర్ధం చేసుకునే ఆలోచన, సమష్టి నాయకత్వం ఉండాలి. వైసీపీలో ఏకనాయకత్వం, ఏక ఆలోచన ఉన్నాయి. తాను చెప్పిందే వేదమనుకునే నాయకుడు... అసెంబ్లీలో ఉప నాయకుడిగా ఉన్న నేను చెప్పిన మాటకు విలువ ఇవ్వలేదు. నన్ను దూరం పెట్టారు. ఇక ఆ పార్టీ పరిణతి చెందదు’’ అని జ్యోతుల వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News