: జ్యోతుల చేరికతో... టీడీపీలో జోష్!: వేదికపైనే ప్రాజెక్టును ప్రకటించిన చంద్రబాబు


తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేరికతో టీడీపీ సర్కారులో నిజంగా జోష్ కనిపిస్తోంది. నిన్న విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీడీపీ కండువా కప్పుకున్న వెంటనే జ్యోతుల ఓ ప్రాజెక్టును ప్రస్తావించారు. సదరు ప్రాజెక్టుకు అక్కడికక్కడే ఆమోదం తెలిపిన ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సదరు ప్రాజెక్టును కట్టి తీరతామని ప్రకటించారు. వివరాల్లోకెళితే... పార్టీలో చేరిన తర్వాత జ్యోతుల తన జిల్లాకు చెందిన పాములేరు చెక్ డ్యాం ఆవశ్యకతను వివరించారు. ‘‘పాములేరు నుంచి ఒక చెక్ డ్యాం కడితే... అటవీ ప్రాంతంలోని నీళ్లు భూపతిపాలెం వస్తాయి. అక్కడి నుంచి సూరప్పాలెంకు ఆ తర్వాత ఏలేరు రిజర్వాయర్ కు వస్తాయి. ఈ ప్రాజెక్టు వస్తే నా జన్మ ధన్యమైనట్లే. ఐదు నియోజకవర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది. 600 నుంచి 700 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసుకోవచ్చు’’ అని జ్యోతుల అన్నారు. దీనికి వేగంగా స్పందించిన చంద్రబాబు ‘‘ఈ రోజే ఆదేశాలిస్తున్నా. మంత్రి (వేదికపై ఉన్న జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును చూపుతూ) ఇక్కడే ఉన్నారు. వెంటనే కార్యాచరణ ప్రారంభిస్తాం. నిర్మించడానికి అవకాశాలను పరిశీలించడం కాదు. తప్పకుండా చేపడతాం. కేంద్రం నుంచి అనుమతి తీసుకుని పని పూర్తి చేస్తాం’’ అని ప్రకటించారు.

  • Loading...

More Telugu News