: ఇక జనంలోకి జనసేన అధినేత!... త్వరలో భారీ కార్యక్రమాలకు పక్కా ప్లాన్
టాలీవుడ్ అగ్ర నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లో క్రియాశీల భూమిక పోషించేందుకు దాదాపుగా రంగం సిద్ధమైంది. గతంలోనే జనసేన పార్టీని ప్రకటించిన పవన్... నాడు ఎన్నికల్లో పోటీకి సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయలేదు. తన తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ విడుదల తర్వాత కీలక నిర్ణయం తీసుకున్న పవన్ కల్యాణ్... వరుసగా పలు టీవీ ఛానెళ్లతో మాట్లాడిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 2019లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా పవన్ కల్యాణ్ ముందుకు సాగుతున్నారు. ఈ విషయంపై పవన్ కల్యాణ్ కాస్తంత పరోక్ష వ్యాఖ్యలు చేస్తున్నా, ఆయన శిబిరం మాత్రం తెర వెనుక భారీ కసరత్తే చేస్తోందట. త్వరలోనే ఏపీ వ్యాప్తంగా పవన్ కల్యాణ్ జనంలోకి రానున్నారట. ఈ మేరకు పాద యాత్ర కానీ, బస్సు యాత్ర కానీ చేపడతారని తెలుస్తోంది. జనసేన విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ యాత్రలు సాగనున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి జనసేనను ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడమే కాక ఒంటరిగానే పోటీ చేయాలని పవన్ కల్యాణ్ పక్కాగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పాదయాత్రలు, బస్సు యాత్రలు, బహిరంగ సభలను వేదికలుగా చేసుకుని వాటి ద్వారానే పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయాలని కూడా పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. ఈ క్రమంలో జనసేన భారీ కసరత్తు చేస్తోందన్న వార్తలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయాయి.