: పవన్ కల్యాణ్ కు పాలిటిక్స్ పై సీరియస్ ఇంట్రస్టు ఉందనుకోవట్లేదు: టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్
చంద్రబాబు నాయుడు చరిష్మా ముందు, ఆయన అనుభవం ముందు, సమర్థత ముందు...అన్నింటి కన్నా ఆయన నీతి నిజాయతీల ముందు ఎంతటి సినిమా నాయకుడైనా ఆగలేడని టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వస్తే ప్రజలు ఆయనను కోరుకుంటారా? లేక చంద్రబాబును కోరుకుంటారా? అనే ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమచ్చారు. వచ్చే ఎన్నికల్లో రాజకీయాల్లోకి వస్తానంటున్న పవన్ కల్యాణ్ ని మిత్రుడిగా చూస్తారా? లేక ప్రత్యర్థిగా చూస్తారా? అనే మరో ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ‘పవన్ కల్యాణ్ గారు మా మిత్రుడు. జనసేన పార్టీ మా మిత్ర పక్షం. భవిష్యత్ లో కూడా ఆయన మాకు మిత్రుడిగానే ఉండాలని, జనసేన పార్టీ కూడా మాకు మిత్రపక్షంగానే ఉండాలని ఆశిస్తున్నాం. పవన్ కల్యాణ్ కేవలం నటుడే కాదు, సామాజిక స్పృహ కల్గిన వ్యక్తి. ఆయనకు పాలిటిక్స్ మీద సీరియస్ ఇంట్రస్ట్ ఉందని అనుకోవట్లేదు’ అని బాబూ రాజేంద్రప్రసాద్ అన్నారు.