: మా అమ్మ, వదినలు అప్పట్లో నా కోరిక తీరనివ్వలేదు... అందుకే, ఇప్పుడు పంచె కడుతున్నా!: పవన్ కల్యాణ్
తన తల్లి, వదినల మీద కసితో పంచెకట్టుకుంటున్నానని పవన్ కల్యాణ్ తెలిపారు. ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ పంచెకట్టుతో కనిపించి సందడి చేశారు. ఈ సందర్భంగా తెలుగుదనం నిండిన పంచెకట్టుతో తమ ఛానెల్ లో కనిపించడం ఆనందంగా ఉందని సదరు టీవీ చానెల్ యాంకర్ అన్నప్పుడు పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, తన చిన్నతనంలో అన్నయ్య వాళ్లు పంచెకట్టుకుంటుంటే చూసి తాను కూడా వారిలా పంచె కట్టుకోవాలని ప్రయత్నించేవాడినని అన్నారు. అయితే తన తల్లి, వదినలు ఏ రోజూ తన కోరిక తీరనివ్వలేదని చెప్పారు. పంచె తీస్తే చాలు, ఇద్దరూ కసురుకునేవారని గుర్తు చేసుకున్నారు. వాళ్లిద్దరి మీద కసితో తాను పంచె కట్టుకున్నానని పవన్ నవ్వుతూ చెప్పారు. ఈ విషయం వాళ్లిద్దరికీ చెప్పాలని పవన్ సరదాగా అన్నారు. తన అన్నయ్యకు తానేంటో తెలుసని పవన్ స్పష్టం చేశారు. అన్నావదినలు తనకు తల్లిదండ్రుల్లాంటి వారని పవన్ తెలిపారు.