: ‘కేశవరెడ్డి స్కూల్’ నిర్వహణ బాధ్యతలు ‘శ్రీ చైతన్య’కు అప్పగించాం: మంత్రి గంటా
కేశవరెడ్డి స్కూల్స్ నిర్వహణ బాధ్యతలను శ్రీ చైతన్య విద్యా సంస్థలకు అప్పగించినట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. వేల మంది విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని వివాదాల్లో ఉన్న కేశవరెడ్డి విద్యా సంస్థల అకడమిక్ నిర్వహణ బాధ్యత శ్రీ చైతన్య విద్యాసంస్థలకు అప్పగించినట్లు చెప్పారు. విద్యా సంబంధమైన కార్యకలాపాలను మాత్రమే ‘శ్రీ చైతన్య’ పర్యవేక్షిస్తుందన్నారు. ఖాతాలు, ఫీజుల విషయంలో ఈ సంస్థ జోక్యం ఉండదని మంత్రి గంటా పేర్కొన్నారు. కాగా, డిపాజిట్ల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలపై కేశవరెడ్డి విద్యాసంస్థల యజమాని నాగిరెడ్డి కేశవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.