: జైష్-ఏ-మహమ్మద్ చీఫ్ పై రెడ్ కార్నర్ నోటీసు
పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్-ఏ-మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. పఠాన్ కోట్ లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ క్యాంప్ పై వ్యూహాత్మక ఉగ్ర దాడులకు కుట్ర పన్నిన కారణంగా అజర్ తో పాటు మరో ముగ్గురిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు. అంతకు ముందు, అజర్, సోదరుడు అసదు రవూఫ్, కాసిఫ్ జాన్, షాహిద్ లతీఫ్ లపై ఎన్ఐఏ న్యాయస్థానం నుంచి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ లను పొందింది. ఈ నలుగురు ఉగ్రవాదులకు సంబంధించిన వివరాలు, వారి తల్లిదండ్రులు, వ్యక్తి గత వివరాలు, చిరునామాలు, వారి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను ఎన్ఐఏ కోర్టు ముందు ఉంచిన విషయం తెలిసిందే. కాగా, పార్లమెంట్ పై, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీపై దాడుల కుట్రకు సంబంధించి జైష్-ఏ-మహమ్మద్ చీఫ్ పై ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసు పెండింగ్ లో ఉంది. అదే విధంగా 1999లో ఐసీ-814 హైజాక్ కేసులో రవూఫ్ పై కూడా ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు పెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే.