: అమ్మాయిల టైట్ జీన్స్, టీషర్ట్స్ పై నిషేధం...అబ్బాయిల కట్నంపై కూడా...యూపీలో గ్రామసభ తీర్పు!
ఉత్తరప్రదేశ్ లోని గ్రామాల్లో కట్టుబాట్లు విధిస్తూ అక్కడి పంచాయతీలు కలకలం రేపుతున్నాయి. యూపీలో న్యాయస్థానాల్లా భావించే పంచాయతీల్లో యువతుల కట్టూబొట్టుపై విధిస్తున్న ఆంక్షలు వివాదాలకు కేంద్రమవుతున్నాయి. భాగ్ పత్ గ్రామ పంచాయతీ అధికారులు మహిళల వస్త్ర ధారణపై ఆంక్షలు విధించారు. టైట్ జీన్స్, లెగ్గింగ్స్, టీషర్ట్స్, బిగుతుగా ఉండే వస్త్రాలు ధరించకూడదని తీర్పు ఇచ్చారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను రక్షించేందుకు ఈ తీర్పు ఇచ్చామని గ్రామపెద్దలు ప్రకటించారు. తమ తీర్పును కాదని, ఎవరైనా అమ్మాయి టైట్ జీన్స్, టీ షర్ట్స్, లెగ్గింగ్స్ లాంటివి వేసుకుని కనిపిస్తే, వారి కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేస్తామని ప్రకటించారు. అలాగే గ్రామంలో వివాహం చేసుకునే పురుషులు కట్నం తీసుకోరాదని, వివాహ వేడుకల్లో డీజేయింగ్ నిర్వహించకూడదని నిర్ణయించారు. ఈ మేరకు గ్రామస్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కట్టుబాట్లు దాటిన వారికి గ్రామ బహిష్కరణ శిక్ష విధిస్తామని వారు స్పష్టం చేశారు.