: మీ డబ్బు మాకొద్దు... రిజర్వ్ బ్యాంక్ పేరిట వచ్చే మోసపూరితమైన ఈ-మెయిల్స్ ను నమ్మకండి: ప్రజలకు రాజన్ హెచ్చరిక
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరిట వస్తున్న ఈ-మెయిల్స్ ను ఎవరూ నమ్మవద్దని, ఆర్బీఐ వద్ద ఎవరూ క్లయిమ్ చేయని డబ్బుపై వచ్చే ఈ-మెయిల్స్ ను తాము పంపడం లేదని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ వెల్లడించారు. రిజర్వ్ బ్యాంక్ పేరిట వస్తున్న ఈ తరహా మెయిల్స్ అసలైనవా? నకిలీవా? అని ప్రశ్నిస్తూ, తనకు రోజుకు 10 ఈ-మెయిల్స్ చొప్పున వస్తున్నందున తాను స్పందించాల్సి వస్తోందని తెలిపారు. "రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెల్లింపులు కోరుతూ ఎప్పుడూ ఈ-మెయిల్స్ పంపదు. మా వద్ద 360 బిలియన్ డాలర్ల విదేశీ నిల్వలు ఉన్నాయి. అంతేకాదు. మా వద్ద రూ. 8 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లు ఉన్నాయి. మాకు మీ డబ్బు అవసరం లేదు" అని అన్నారు. "మీకు ఒక ఈ-మెయిల్ వచ్చి, మీకు లాటరీలోనో లేదా ప్రతిఫలంగానో రూ. 50 లక్షలు వచ్చాయి. లావాదేవీ ఖర్చుల కింద రూ. 20 వేలు కట్టండి అని ఈ-మెయిల్స్ వస్తే, ఎట్టి పరిస్థితుల్లోను వాటిని నమ్మవద్దు. మా డబ్బును ఎవరికీ ఇవ్వము, మీ డబ్బును అడగము" అని రాజన్ క్లారిటీ ఇచ్చారు.