: నమ్మితే భుజానికెత్తుకునే ప్రజలు, నమ్మకుంటే బండకేసి కొడతారు: కేసీఆర్
నమ్మిన రాజకీయ నాయకులను భుజానికెత్తుకుని అధికారాన్ని అప్పగించే ప్రజలు, అదే నమ్మకాన్ని కోల్పోయిన వేళ, బండకేసి కొడతారన్న విషయాన్ని నేతలంతా నిత్యమూ మనసులో గుర్తుంచుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం గ్రేటర్ హైదరాబాద్ లో గెలిచిన కార్పొరేటర్లకు శిక్షణా కార్యక్రమాలు ప్రారంభం కాగా, కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పదవులు పొందడం గొప్ప కాదని, వచ్చిన పదవులను కాపాడుకోవాల్సిన బాధ్యత అత్యంత క్లిష్టమైనదని అన్నారు. గతంలో కార్పొరేటర్లపై ఎంతో చెడ్డపేరు ఉండేదని, ఆ మచ్చను నూతన కార్పొరేటర్లు తొలగించాలని పిలుపునిచ్చారు. అమలు చేయలేని వాగ్దానాలను ప్రజలకు ఇవ్వవద్దని సూచించిన కేసీఆర్, చిత్తశుద్ధితో ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తే, భవిష్యత్తులో మరిన్ని విజయాలు పొందవచ్చని అన్నారు.