: ప్రకాశం జిల్లాలో సర్పంచ్ దారుణ హత్య... సంతాపం ప్రకటించిన వైఎస్ జగన్
ప్రకాశం జిల్లాలో నిన్న రాత్రి వైసీపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. జిల్లాలోని సంతమాగులూరు సర్పంచ్ గా వ్యవహరిస్తున్న గడ్డం వెంకటరెడ్డి(45)పై గొడ్డళ్లతో దాడి చేసిన ప్రత్యర్థులు ఆయనను అత్యంత దారుణంగా హత్య చేశారు. నిన్న పగలంతా పని చూసుకుని రాత్రికి ఇంటికి చేరుకున్న వెంకటరెడ్డి... తన ఇంటి ఆవరణలో మరో వ్యక్తితో మాట్లాడుతుండగా మెరుపు దాడి చేసిన ఆరుగురు ప్రత్యర్థులు వెంకటరెడ్డిని నరికి చంపారు. ఈ దాడికి దిగిన వారు ఆయన స్వగ్రామానికి చెందిన వారేనని తెలుస్తోంది. వెంకటరెడ్డి హత్యపై వేగంగా స్పందించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులను ఫోన్ లో పరామర్శించారు. నేటి ఉదయం వెంకటరెడ్డి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన జగన్... వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.