: గర్ల్ ఫ్రెండ్ కోసమట... ఢిల్లీ విమానాశ్రయంలోకి దొంగ టికెట్ తో వెళ్లిన విదేశీయుడు!


విమానాశ్రయాల్లో భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి ఓ విదేశీయుడు తప్పుడు టికెట్ తో ప్రవేశించి దొరికిపోయాడు. విమానాశ్రయాల గేట్ల వద్ద ఉన్న సీఆర్పీఎఫ్ దళాలకు, టికెట్లు ఒరిజినల్ అవునా? కాదా? అన్న విషయాన్ని సరిపోల్చుకునేందుకు స్కానర్లు అందుబాటులో లేకపోవడం కూడా అక్రమంగా లోనికి ప్రవేశిస్తున్న వారికి లాభిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇక తాజా ఘటన విషయానికి వస్తే, స్పెయిన్ పాస్ పోర్టును కలిగివున్న మైకేల్ ఎలీస్ రోడ్రిగ్యూ అనే వ్యక్తి టర్మినల్ 3 ప్రవేశ ద్వారం నుంచి ఢిల్లీ-ఫ్రాంక్ ఫర్ట్ మధ్య ప్రయాణానికి బుక్ చేసినట్టున్న టికెట్ ను చూపి లోపలికి వెళ్లాడు. ఈ తెల్లవారుఝామున ఈ ఘటన జరిగింది. అతను తన స్నేహితురాలిని కలిసేందుకు ఈ పని చేశాడట. ఆపై తిరిగి బయటకు వచ్చేందుకు గేటు వద్ద తచ్చాడుతున్న అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే ఈ విషయం వెల్లడైంది. అతని పేరున ఎలాంటి టికెట్ బుక్ కాలేదని తెలుసుకున్న భద్రతా దళాలు, అతన్ని ఢిల్లీ పోలీసులకు అప్పగించగా, అతనిపై ఫోర్జరీ, చీటింగ్ కేసులు నమోదయ్యాయి. కాగా, 2015లో 50 మందికి పైగా తప్పుడు టికెట్లతో విమానాశ్రయాల్లోకి ప్రవేశించగా, ఈ సంవత్సరం ఇప్పటికే 20కి పైగా ఇదే తరహా కేసులు నమోదయ్యాయి. ఎలాంటి ఫ్రిస్కింగ్ లేకుండా, కేవలం టికెట్ మీద పేరు, ఐడీ కార్డును చూపించి విమానాశ్రయాల్లోకి వెళ్లవచ్చన్న సంగతి తెలిసిందే. దీంతో ఏదైనా ఉగ్రదాడులకు అవకాశాలు ఉన్నాయని భయపడుతున్న విమానయాన శాఖ, గేటు ముందున్న సీఐఎస్ఎఫ్ దళాల వద్ద బార్ కోడ్ లను పరిశీలించే మెషీన్లను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తూ, పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ ను ఎంచుకుంది. ఇక్కడ విధానం సత్ఫలితాలను ఇస్తే, దేశవ్యాప్తంగా ఇదే పద్ధతిని అవలంబిస్తారు.

  • Loading...

More Telugu News