: పాతబస్తీ మైనర్ బాలుడి ప్రాణం తీసిన ఫైర్ స్టంట్
పాతబస్తీ యువకులకు ప్రాణాలపై చులకన భావం నానాటికీ పెరిగిపోతోంది. స్ట్రీట్ ఫైట్ల పేరిట అక్కడ నిత్యం జరిగే కుస్తీ పోటీల్లో పెద్ద సంఖ్యలో యువకులు గాయపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఇక టీవీ షోలను అనుకరిస్తూ ఫైర్ స్టంట్ చేసిన ఓ మైనర్ బాలుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. వివరాల్లోకెళితే... టీవీ రియాలిటీ షోలను చూసిన జలాలుద్దీన్ అనే 17 ఏళ్ల బాలుడు ఈ నెల 7న ఫైర్ స్టంట్ చేశాడు. స్నేహితుల సమక్షంలోనే అతడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని స్వయంగా తన శరీరానికి నిప్పు పెట్టుకున్నాడు. ఆ సందర్భంగా అతడి మిత్రులు వారిస్తున్నా అతడు వినలేదు. ఈ స్టంట్ లో జలాలుద్దీన్ యత్నం బెడిసికొట్టింది. శరీరానికి స్వహస్తాలతో పెట్టుకున్న నిప్పు కారణంగా అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడు ఆసుపత్రి బెడ్ పైకి చేరాడు. ఈ క్రమంలో వైద్యులు అందించిన చికిత్స పెద్దగా ఫలితాన్నివ్వలేకపోయింది. చికిత్స పొందుతూనే అతడు నేటి ఉదయం చనిపోయాడు. దీంతో పాతబస్తీలో విషాద ఛాయలు అలముకున్నాయి. జలాలుద్దీన్ చనిపోయిన నేపథ్యంలో అతడి ఫైర్ స్టంట్ కు చెందిన వీడియో మీడియా చేతికి చిక్కింది. ప్రస్తుతం ఈ వీడియో తెలుగు టీవీ ఛానెళ్లలో ప్రముఖంగా ప్రసారమవుతోంది.