: చేయాలని ఉన్నప్పటికీ చంద్రబాబు చెయ్యలేకపోతున్నారు: పవన్
రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలన్న తపన చంద్రబాబులో ఉన్నప్పటికీ, ఆయన చుట్టూ ఉన్న వ్యవస్థ ముందుకు సాగనీయడం లేదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఆయన మీద తనకు మిశ్రమ అభిప్రాయాలే ఉన్నాయని అన్నారు. తనకు వచ్చే ఫీడ్ బ్యాక్ ను బట్టి, ఆయనకు చేయాలని ఉందని, ఆ ప్రయత్నం చేస్తున్నారని, ఇదే సమయంలో చేయలేకపోతున్నానని బాధ పడుతున్నారని కూడా తెలుస్తోందని పవన్ చెప్పుకొచ్చారు. వైకాపా నుంచి ఎమ్మెల్యేలను తీసుకువెళ్లడం, తప్పుదారికి సంకేతమేనని అన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించాల్సిన అవసరం ఇప్పుడేమొచ్చిందని ప్రశ్నించారు. పదవి, అధికారం లేకుంటే ప్రజాసేవ చేసేందుకు వీలుండదా? అని అడిగారు. అవకాశవాద రాజకీయాలతో మేలు పెద్దగా ఉండబోదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై అసంతృప్తిగా ఉందని, ఇవ్వాలని భావిస్తే వెంటనే ఇచ్చేయాలని, లేకుంటే ఇవ్వడం లేదని తేల్చి చెప్పాలని ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ డిమాండ్ చేశారు.