: అప్పు తీసుకున్న వారికి లాభం - పొదుపు చేస్తే కష్టం!


గత వారంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి సమీక్ష తరువాత, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారిలో, నెలసరి కిస్తీల భారం తగ్గుతుందన్న ఆనందం నెలకొన్న వేళ, చిన్న మొత్తాల పొదుపు, పీపీఎఫ్ (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్) ఖాతాలు, సుకన్యా సమృద్ధి తదితర పన్ను రహిత ఆదాయ మార్గాల్లో పెట్టుబడులు పెట్టిన వారు చింతించాల్సిన పరిస్థితి. పరపతి సమీక్ష తరువాత రెపో రేటును పావు శాతం మేరకు తగ్గిస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించగా, ఆపై చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై బ్యాంకులు ఆఫర్ చేస్తున్న వడ్డీ 20 నుంచి 25 బేసిస్ పాయింట్లు తగ్గవచ్చని రీసెర్చ్ ఏజన్సీ ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. జూలై - సెప్టెంబర్ మధ్య కాలంలో అన్ని రకాల సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ తగ్గింపు ప్రకటనలు ఉంటాయని పేర్కొంది. ఇదే జరిగితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నుంచి పీపీఎఫ్ వడ్డీ రేటు 7.85- 7.9 శాతం మధ్యకు చేరవచ్చు. ఇక ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన సరికొత్త చిన్న మొత్తాల పొదుపు ఖాతాల నిబంధనలను పరిశీలిస్తే, వడ్డీ రేట్లు ప్రతి మూడు నెలలకూ ఒకసారి సవరించబడతాయి. అదికూడా, అంతకుముందు మూడు నెలల కాలంలో ప్రభుత్వ రంగ సెక్యూరిటీస్ ఎంత రాబడిని ఇచ్చాయన్న విషయంపై ఆధారపడి మారుతుంటాయి. ఇప్పటికే భారత సెక్యూరిటీ బాండ్ల రేటు పడిపోవడంతో, ఇటీవల పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును సైతం కేంద్రం తగ్గించిన సంగతి తెలిసిందే. దీని ఫలితంగా 8.7 శాతంగా ఉన్న పీపీఎఫ్ ఖాతాలపై వడ్డీ రేటు ఏప్రిల్ - జూన్ త్రైమాసికానికి 8.1 శాతానికి తగ్గి వచ్చింది. సీనియర్ సిటిజన్లకు వడ్డీ 9.3 నుంచి 8.6 శాతానికి తగ్గింది. సుకన్యా సమృద్ధి ఖాతాలపై వడ్డీ 9.2 నుంచి 8.6 శాతానికి దిగివచ్చింది. సమీప భవిష్యత్తులో ఈ వడ్డీ రేట్లు మరింతగా తగ్గవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, తదుపరి వడ్డీ రేటు సమీక్ష జూన్ 15న జరుగనుంది.

  • Loading...

More Telugu News