: తెలుగు రాష్ట్రాలు... ఒకే సెల్ ఫోన్ లో రెండు సిమ్ కార్డులు: ‘మహా’ గవర్నర్ విద్యాసాగర్ రావు


తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలకు సంబంధించి మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు నిన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయినా, భాషా పరంగా ఆ రాష్ట్రాలను ఏ ఒక్కరూ విడదీయలేరని ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిన్న దేశ రాజధానిలో 28వ ఉగాది సాంస్కృతిక ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన విద్యాసాగర్ రావు మాట్లాడుతూ సమైక్య రాష్ట్రాన్ని... ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలుగా విభజిస్తూ పార్లమెంటులో చట్టం చేశారని పేర్కొన్న ఆయన తెలుగు భాషను విడగొడుతూ ఎవ్వరూ చట్టం చేయలేరన్నారు. ఏపీ, తెలంగాణలు విడిపోయినా... అవి ఒకే సెల్ ఫోన్ లో రెండు సిమ్ కార్డులని విద్యాసాగర్ రావు చమత్కరించారు. సదరు సెల్ ఫోన్ లో తెలుగు భాషే అతిపెద్ద సాఫ్ట్ వేర్ అని అన్నారు. ఆ సాఫ్ట్ వేర్ ను మెరుగుపరచుకోవాలని సూచించారు. సిలికాన్ వ్యాలీలో ఐటీ జెండాను ఎగురవేసింది తెలుగువారేనని ఆయన గుర్తు చేశారు. ‘నా’ నుంచి ‘మా’ వరకు, ‘మా’ నుంచి ‘మన’ వరకు అంతా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News