: 'అత్తారింటికి దారేది' తర్వాత నాతో సినిమా తీసేందుకు ఎవరూ ముందుకు రాలేదు!: పవన్ కల్యాణ్


తనపైన, తన సినిమాలపైన అంచనాలు ఎక్కువగా ఉంటాయని పవన్ కల్యాణ్ చెప్పాడు. 'సర్దార్ గబ్బర్ సింగ్' ప్రమోషన్ లో ఆయన మాట్లాడుతూ, ఆ అంచనాలను తాను రీచ్ అవ్వలేనని అన్నాడు. అందుకే తానెప్పుడూ కలెక్షన్లు, విజయాలు, అపజయాలను చూసి ఉత్సాహానికి గానీ నిరుత్సాహానికి గానీ గురికాలేదని ఆయన తెలిపాడు. 'అత్తారింటికి దారేది' సినిమా తరువాత తనతో సినిమాలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని పవన్ చెప్పాడు. దీంతో, తప్పని సరి పరిస్థితుల్లో తనంత తానుగా పెన్నుపట్టాల్సి వచ్చిందని, ఆ అవసరమే కథ రాసేలా చేసిందని పవన్ పేర్కొన్నాడు. తనకు సినీ పరిశ్రమలో మార్కెట్ ఎలా ఏర్పడిందో తెలియదు కానీ చాలా మార్కెట్ ఉందని అన్నాడు. తనతో సినిమాలు తీయాలంటే కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని పవన్ చెప్పాడు. తనతో సినిమాలు తీసేందుకు చాలా మంది ఉన్నారని, అయితే డబ్బులున్నాయి కదాని తీద్దామని భావించే వారే ఎక్కువని, ఇమేజ్, అభిమానులను అంచనాలు... వంటి బాధ్యతలన్నీ తీసుకునేందుకు ఎవరూ సిద్ధంగా లేరని, అందుకే తాను పెన్నుపట్టాల్సి వచ్చిందని పవన్ కల్యాణ్ చెప్పాడు. త్వరలో తాను త్రివిక్రమ్, ఎస్ జే సూర్యతో సినిమాలు చేస్తానని ఆయన వెల్లడించాడు. సినిమాను ఏదో తూతూ మంత్రంగా పూర్తి చేయడం తనకు నచ్చదని, ఏ పని చేసినా వంద శాతం చిత్తశుద్ధితో చేయాలని భావిస్తానని ఆయన తెలిపాడు.

  • Loading...

More Telugu News