: ఇప్పటి నాయకులు ఎందుకు పార్టీలు మారుతున్నారో అందరికీ తెలిసిందే!: పవన్ కల్యాణ్
ప్రస్తుత రాజకీయాల్లో డబ్బు క్రియాశీలక పాత్ర పోషిస్తోందని...ఈ పద్ధతిని ఎవరో ఒకరు మార్చాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ చెప్పారు. ఆ వెంటనే మళ్లీ చెబుతూ, 'ఎవరో మార్చడం ఎందుకు? ఈ మార్పుకు నేనే నాంది పలుకుతా'నని ఆయన అన్నారు. భావదారిద్ర్యం తనకు నచ్చదని, ఉన్నత ఆశయాలు లేకపోతే అది దౌర్భాగ్యం కిందే లెక్క అని ఆయన తెలిపారు. రాజకీయ నాయకులు పార్టీ మారాలంటే దానికి చాలా బలమైన కారణం ఉండాలని పవన్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎందుకు పార్టీలు మారుతున్నారో అందరికీ తెలిసిందేనని ఆయన పేర్కొన్నారు. సిద్ధాంతాలు లేని నాయకులుంటే ఇలాగే ఉంటుందని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో తాను చాలా బాధపడ్డానని పవన్ కల్యాణ్ చెప్పారు. అప్పట్లో ప్రజల తరపున మాట్లాడే నాథుడు కనపడలేదని ఆయన తెలిపారు. రాజకీయ నాయకులు, పాలకులు చేసిన తప్పులకు ప్రజలను బాధ్యులను చేసి విభజన చేశారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ వెనుకబాటు తనానికి బాధ్యత రాజకీయ నాయకులదైతే దానిని ప్రజలను బాధ్యులుగా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను కూడా ప్రజల్లో మనిషినేనని, అందుకే బాధపడ్డానని ఆయన చెప్పారు. ఈ విభజన సందర్భంగా ఒక్క నాయకుడు కూడా ప్రజల పక్షాన నిస్వార్ధంగా మాట్లడలేదని ఆయన గుర్తుచేసుకున్నారు. తాను చెప్పిన ఏ మాటా మర్చిపోలేదని ఆయన స్పష్టం చేశారు. గొడవ పెట్టుకుంటే వెనక్కి తగ్గే వ్యక్తిని కాదని ఆయన స్పష్టం చేశారు. తన మనసులో చాలా ప్రణాళికలు ఉన్నాయని, వాటిని వెల్లడించే సమయం కోసం చూస్తున్నానని పవన్ కల్యాణ్ తెలిపాడు.